ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రేపు రాష్ట్ర బంద్‌.

0
42

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజు కొనసాగుతోంది. చర్చలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో కార్మికుల ఆందోళనలు, నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రజా, ఉద్యోగ సంఘాలు, విపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులు, తెలంగాణ మెడికల్ ఉద్యోగుల జేఏసీ కూడా సంఘీ‌భావం ప్రకటించింది. ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో కరీంనగర్ రెండు డిపోల ముందు కార్మికులు శుక్రవారం ధర్నా, నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు సహకరించాలని ప్రజలకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వామపక్షాల నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నామని తెలిపారు. వ్యాపార, వాణిజ్య, సామాన్య వర్గాలు సహకరించాలని కోరారు. బంద్‌కు వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని.. సన్నాహకాల్లో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్నామని చెప్పారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్ శేరిలింగంపల్లి నుంచి కూకట్‌పల్లి వరకు బీజేపీ బైక్‌ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్  స్వయంగా బైక్‌ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బైక్‌ ర్యాలీకి హాజరయ్యారు.