‘రాజుగారి గది 3’ మూవీ రివ్యూ. మూడోపార్టులో దెయ్యం నవ్వించి.. భయపెట్టిందా?

0
120

‘ఆట’లాంటి షోస్‌తో టెలివిజన్‌ తెరపై సత్తా చాటిన ఓంకార్‌.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్‌ కామెడీ జానర్‌లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ సిరీస్‌లో తీసే చిత్రాలకు క్రేజ్‌ ఏర్పడింది. ఆ తర్వాత నాగార్జున, సమంత వంటి అగ్రశ్రేణి స్టార్స్‌తో తీసిన ‘రాజుగారి గది-2’ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హర్రర్‌ కామెడీనే నమ్ముకున్న ఓంకార్‌ ‘రాజుగారి గది-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి అశ్విన్‌ బాబుకు జోడీగా అవికా గోర్‌ నటించిన ‘రాజుగారి గది-3’ ప్రేక్షకులను మెప్పించిందా? అసలు గదిలో ఏముంది? ఈ మూడోపార్టులో దెయ్యం నవ్వించి.. భయపెట్టిందా? తెలుసుకుందాం పదండి!

రాజుగారి గదిలో హీరోగా చేస్తూ వస్తున్న అశ్విన్‌ బాబు.. ఈ సినిమాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్‌ పరంగా కొంచెం మెరుగయ్యాడు. కానీ, డైలాగ్‌ మాడ్యులేషన్‌ అనేక యాసల్లో ఉండటం కనిపిస్తుంది. ఇక, మాయగా అవికా గోర్‌ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది. క్లైమాక్స్‌లో కాసేపు దెయ్యంగా కనిపించింది. ఫస్ట్‌ హాఫ్‌లో అలీ, అశ​న్‌లతో కలిసి బ్రహ్మాజీ, శివశంకర్‌ మాస్టార్‌, గెటప్‌ శ్రీను తదితరులు కాసింత నవ్వులు పంచారు.సెకండ్‌ హాఫ్‌లో  గరడ పిళ్లై, రాజమాతలుగా అజయ్‌ ఘోష్‌,  సీనియర్‌ నటి ఊర్వశీలు.. అలీ, అశ్విన్‌ తోడుగా దెయ్యాలతో కలిసి హర్రర్‌ కామెడీ పండించారు. ముఖ్యంగా అలీ, అజయ్‌ ఘోష్‌, ఊర్వశీ తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. నవ్వులు పంచారు.