హుజూర్‌నగర్ ఓటర్లు.. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికి ఘన విజయం కట్టబెట్టిన నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అక్కడ భారీ బహిరంగ సభను తలపెట్టారు. ‘కృతజ్ఞత సభ’ పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశం శనివారం (అక్టోబర్ 26) సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. అక్కడ భారీ వర్షం కురుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
కుండపోత వాన కారణంగా హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ తలపెట్టిన ఎన్నికల బహిరంగ సభ అర్ధంతరంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభకు వరుణుడు మరోసారి అడ్డంకిగా మారతాడా? అని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే.. వర్షం కురిసినా ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని నేతలు చెబుతున్నారు.
బహిరంగ సభకు వర్షం కారణంగా ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సైదిరెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ఇప్పటికే రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారని.. సభ ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందని తెలిపారు. హుజూర్‌నగర్ సభకు సీఎం కేసీఆర్.. హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి మీదుగా బయలుదేరారు. సూర్యాపేట, కోదాడ మీదుగా హుజూర్‌నగర్ చేరుకున్నారు.