టీడీపీకి షాకిచ్చిన వల్లభనేని వంశీమోహన్ రాజీనామా.

0
53

దీపావళి వేళ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అంతా ఊహించినట్లుగానే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ టీడీపీకి షాకిచ్చారు. తాజాగా సీఎం జగన్ తో సమావేశం తర్వాత దీపావళి ముగిశాక తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పిన వంశీ… దానికి తగినట్లుగానే టీడీపీకి గుడ్ బై చెప్పారు. అనుచరులపై కేసులు, వేధింపుల నేపథ్యంలో వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే ఎమ్మెల్యే పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెబుతున్నట్లు అధినేత చంద్రబాబుకు పంపిన వాట్సాప్ లేఖలో ప్రకటించారు. అదే సమయంలో రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వంశీ తన లేఖలో చెప్పడం ఈ మొత్తం వ్యవహారానికి పెద్ద ట్విస్ట్ గా చెప్పవచ్చు.

అయితే వైసీపీ పెద్దల నుంచి భవిష్యత్తుపై హామీ లభించిన నేపథ్యంలోనే వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననే ప్రతిపాదనను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్లు అర్ధమవుతోంది. దీంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ తెలిపారు. పార్టీ సభ్యత్వం వరకూ అయితే చంద్రబాబుకు పంపిన లేఖ సరిపోతుంది. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే స్పీకర్ కు నిర్ణీత ఫార్మాట్ లో రాజీనామా లేఖను పంపాల్సి ఉంది. అది ఎప్పుడు పంపుతారన్న దానిపై వంశీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ టీడీపీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాత్రం వంశీ పార్టీ అధినేతకూ, మిగతా వారికీ తెలిసేటట్లు ఓ లేఖ మాత్రం పంపి వదిలేశారు. దీన్ని బట్టి ఆయన వెంటనే వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు లేకపోవచ్చనే తెలుస్తోంది.