ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు తమకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలంటూ 26 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం… తమ డిమాండ్ నెరవేరే వరకు సమ్మెను విరమించేది లేదని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు… ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామిని కలిశారు. జీయర్ ఆశ్రయంలో స్వామీజీని కలిసిన ఆర్టీసీ కార్మికులు… తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించేలా వారికి సూచించాలని జీయర్ స్వామికి విజ్ఞప్తి చేశారు.
ఇటీవల సీఎం కేసీఆర్ చిన్నజీయర్ స్వామి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన తిరునక్షత్రోత్సవం కార్యక్రమంలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో రెవెన్యూ శాఖ ఉద్యోగులు సైతం చిన్నజీయర్ స్వామిని కలిసి తమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించేలా వారికి సూచించాలని కోరారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు సైతం రెవెన్యూ శాఖ ఉద్యోగుల బాటలోనే జీయర్ స్వామిని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.