ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారిని బలితీసుకున్న డెంగ్యూ వ్యాధి.

0
34

తెలంగాణలో డెంగ్యూ వ్యాధి ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారిని బలితీసుకుంది. తాత, మనవడు, కుమారుడు అతడి భార్య నలుగురూ డెంగ్యూ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో 70 ఏళ్ల వృద్ధుడి నుంచి ఐదేళ్ల చిన్నారి వరకు ఉండడం గమనార్హం. మంచిర్యాల జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల శ్రీశ్రీ నగర్‌కు చెందిన గుడిమెల్ల రాజు, అతడి భార్య సోనా, కుమార్తె శ్రీవర్షిణి, రాజు తండ్రి లింగయ్య డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే వారంతా ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

గుడిమెల్ల రాజు ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం డెంగ్యూ కారణంగా రాజు చనిపోయాడు. ఆ తర్వాత లింగయ్యకు డెంగ్యూ సోకింది. అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత డెంగ్యూ వ్యాధి ఐదేళ్ల చిన్నారి శ్రీవర్షిణిని కూడా పొట్టనపెట్టుకుంది. ఆ కుటుంబంలో మిగిలిన ఒకే ఒక్కరు రాజు భార్య సోనా. ఆమెకు కూడా డెంగ్యూ వ్యాధి సోకింది. సోనా తొమ్మిది నెలల గర్భిణి. ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు డెలివరీ చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన 12 గంటల్లోనే తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది.

ఇప్పుడు ఆ పసిబిడ్డ అనాధగా మారిపోయాడు. 15 రోజుల క్రితం నలుగురు సభ్యులతో ఆనందంగా.. ఐదో సభ్యుడి కోసం ఎదురుచూస్తున్న ఆ ఇంట్లో ఇప్పుడు బంధువుల ఏడుపులు, కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ పసిబిడ్డను చూసిన బంధువులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.