ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతితో కార్మికులు తీవ్ర ఆందోళన. ఆర్టీసీపై సీఎం నేడు తుది నిర్ణయం.

0
24

తెలంగాణ ఆర్టీసీ సమ్మె 28వ రోజుకు చేరింది. ఓవైపు సమ్మె.. మరోవైపు కార్మికుల మరణాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు. ఆర్టీసీపై ఇంతకుముందు ప్రకటించిన నిర్ణయానికే సీఎం కట్టుబడి ఉంటారా? లేక నిర్ణయాన్ని మార్చుకుంటారా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆర్టీసీ భవితవ్యాన్ని తేల్చేందుకు సీఎం ఇప్పటికే పలువురు నిపుణులు,సీనియర్ ఐఏఎస్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు,కేంద్రం అమలు చేస్తున్న రవాణా చట్టంపై కూడా సమగ్ర అధ్యయనం చేశారు. వీటన్నింటిని క్రోడికరించి ఆర్టీసీపై సీఎం నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతితో ఆర్టీసీ జేఏసీ నేడు కరీంనగర్‌ బంద్‌కి పిలుపునిచ్చింది. ప్రభుత్వం చర్చలు జరిపేవరకు బాబు అంత్యక్రియలు నిర్వహించబోమని ఎంపీ బండి సంజయ్ తెగేసి చెప్పారు. నేడు కరీంనగర్‌కు ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకునే అవకాశం ఉన్నందునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.