సమాజంలో ఏదైనా మంచి మార్పు రావాలంటే… యువతను సరైన దారిలో నడిపించాలంటే… ప్రముఖుల ద్వారా సందేశాలు ఇప్పించడం ఎప్పటి నుంచో ఉన్నదే. ఐతే… యూత్‌లో జబర్దస్త్ యాంకర్ అనసూయకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందువల్ల ఓ అంశంపై ఆమెతో సందేశం ఇప్పించాలనుకుంది ఓ న్యూస్ ఛానెల్. అనుకున్న విధంగానే… ఆమెకు విషయం చెప్పింది. అంది మంచి ఉద్దేశమే కావడంతో… అనసూయ కూడా ఆ సందేశం ఇచ్చేందుకు ఒప్పుకుంది.
రూ.10 కాయిన్ సమస్య : మన సమాజంలో కొన్నింటిని ప్రజలే తిరస్కరించేస్తారు. అలాంటి వాటిలో రూ.10 నాణెం ఒకటి. చాలా మంది ఆ కాయిన్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అదేమంటే… మా దగ్గర దాన్ని ఎవరూ తీసుకోరు అంటున్నారు. ఇలా రూ.10 నాణెం ఉన్నవారు… దాన్ని ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నారు. అంతే తప్ప అది అధికారికంగా చెల్లే నాణెం అని గుర్తించట్లేదు. దీనిపైనే అనసూయ సందేశం ఇచ్చింది. పది రూపాయల కాయిన్ చెల్లుతుందనీ, ప్రతి ఒక్కరూ దాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని తన సందేశంలో ఆమె కోరింది. అంతే కాదు… బ్యాంకుల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో, బస్సులో అన్నింటిలో రూ.10 కాయిన్ చెల్లుబాటు అవుతుందని వాస్తవాన్ని చెప్పింది అనసూయ.
అనసూయ చెప్పిన సందేశాన్ని ప్రజలు పాటిజివ్‌గా తీసుకుంటారని భావిస్తోంది. ఇన్నాళ్లూ ఆలోచన మార్చుకోని ప్రజలు ఇప్పుడు అనసూయ చెప్పిందని మనసు మార్చుకుంటారా అన్నది ఆలోచించాల్సిన విషయమే. చాలా మందికి రూ.10 కాయిన్ తీసుకోవడం ఇష్టమే. కానీ… దాన్ని తమ దగ్గర ఇతరులు తీసుకోవట్లేదు అన్న ఆలోచనతోనే వాళ్లూ వెనకడుగు వేస్తున్నారు.
నిజానికి ఇలా చెల్లుబాటు అయ్యే కాయిన్ తీసుకోకపోవడం చట్ట రీత్యా నేరం. ఇలా తీసుకోని వారిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టొచ్చు. న్యాయం పొందొచ్చు. ఐతే… రూ.10 కాయిన్ కోసం ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్లకు ఎవరు వెళ్తారు? కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు? అందుకే ఎవరికి వారు తమకెందుకొచ్చిన సమస్య అనుకుంటూ… రూ.10 నాణెం వద్దంటున్నారు. ఇప్పటికే ఈ అంశంపై రిజర్వ్‌బ్యాంక్ ఎన్నోసార్లు చెప్పింది. రూ.10 నాణేన్ని ఎవరైనా తీసుకోవాల్సిందేననీ, అది చెల్లుతుందని తెలిపింది.