ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌కాల్‌.. మనస్తాపంతో వరుడు ఆత్మహత్య.

0
56

ఓ గుర్తుతెలియని వ్యక్తి చేసిన ఫోన్‌కాల్‌తో పెళ్లి ఆగిపోవడం, దీంతో మనస్తాపం చెందిన వరుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని గొల్లపూడిలో విషాదం నింపింది. పెళ్లికొడుకు మంచివాడు కాదని, గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని పెళ్లికూతురు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెళ్లి రద్దు చేసుకున్నారు.

గొల్లపూడికి చెందిన మరికొండ శ్రీను (19) ఆటోనగర్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఏడాది కాలంగా స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీను తల్లిదండ్రులు అమ్మాయి తరపు వారితో మాట్లాడి పెళ్లి నిశ్చయం చేశారు. కార్తీక అమావాస్య వెళ్లిన తర్వాత వివాహం చేద్దామని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. దీంతో ఆ ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రెండ్రోజుల క్రితం ఓ వ్యక్తి యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి..‘శ్రీను మంచోడు కాదు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి వదిలేశాడు. మీ అమ్మాయిని అతడికిచ్చి పెళ్లి చేస్తే ఆమె గతి కూడా అంతే’ అని చెప్పాడు. దీంతో పెళ్లికూతురు తల్లిదండ్రులు శ్రీను కుటుంబంతో వాగ్వాదానికి దిగి పెళ్లి క్యాన్సిల్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను ఆదివారం ఉదయం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదుతో భవానీపురం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వ్యక్తి ఎవరా? అన్నదానిపై ఆరా తీస్తున్నారు.