ఆర్టీసీ సమ్మెను 11 వరకు వాయిదా వేసిన హైకోర్టు .

0
44

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది. కార్మికుల తరఫున ప్రతినిధులు, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ,ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతా తప్పుల తడకగా ఉందని వ్యాఖ్యానించింది. ఐఏఎస్ స్థాయి అధికారులు ఇంత దారుణంగా నివేదిక ఇవ్వడం తన సర్వీస్‌లోనే చూడలేదని చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు. తాము సమస్యను పరిష్కరించాలని చూస్తుంటే.. ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం చిత్తశుద్ధి లేనట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. సమ్మెపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసింది. అనంతరం విచారణను 11వ తారీఖు వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

అంతకుముందు.. మోటార్ వెహికల్ ట్యాక్స్ కింద రూ.453 కోట్లు ఆర్టీసీయే ప్రభుత్వానికి బకాయి పడిందని ప్రభుత్వం అఫిడవిట్స్ దాఖలు చేసిన నేపథ్యంలో.. అధికారులు స్వయంగా దానిపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక శాఖ సమర్పించిన నివేదికలను పరిశీలించి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు నివేదికలు పరస్పరం విరుద్దంగా ఉన్నాయని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంది.