తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా.. మరికొంతమంది గుండెపోటుతో మృతి చెందారు. ఇక కుటుంబ పోషణ భారమై కూలీ పనులకు సైతం కార్మికులు వెళ్తున్నారు. కొందరు కార్మికులు తమ కులవృత్తులను చేపట్టి అంతో ఇంతో సంపాదించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ ఏంటన్న బెంగ కార్మికుల్లో మరింత తీవ్రమవుతోంది. తాజాగా మంథని డిపోకి చెందిన సమ్మయ్య అనే కండక్టర్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరాడు. ఉద్యోగంపై ఆందోళనతో ఆయన గుండెపోటుకు గురైనట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 18కి హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ బస్సుల పర్మిట్లపై విధించిన స్టే అలాగే కొనసాగుతోంది. హైకోర్టు ప్రతిపాదించిన హైపవర్ కమిటీకి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో.. తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠగా మారింది.