మరోసారి రాజకీయ సన్యాసం తీసుకుంటున్న దగ్గుబాటి.

0
63

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం పంచాయతీకి వైసీపీ అధినేత,ఏపీ సీఎం జగన్ ముగింపు పలికినట్టు తెలుస్తోంది. పరుచూరు వైసీపీ ఇన్ చార్జిగా రవి రామనాధబాబు పేరును వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. అయితే దీనిపై అధికారి ప్రకటన ఇంకా వెలువడలేదు. అధిష్టానం ఆదేశాల మేరకు ఒంగోలులో జరిగిన నాడు నేడు కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్న సభకు రామనాథం బాబు పరుచూరు వైసీపీ ఇన్ చార్జి హోదాలో పాల్గొన్నారు. సీఎం సభలో ముందు వరుసలో కూర్చున్నారు. దీంతో పరుచూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ వ్యవహారానికి పుల్ స్టాప్ పడినట్టే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే పార్టీలోని అసంతృప్తి నేతలను సమన్వయం చేసుకోవాలని రామనాథంకు అధిష్టానం షరతులు పెట్టినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సీఎం జగన్ నిర్ణయంతో సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరోసారి రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టే అని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో పర్చూరు వైసీపీ అభ్యర్థిగా మళ్లీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి… ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికల తరువాత దగ్గుబాటి దంపతులు ఒకే పార్టీలో ఉండాలని సీఎం జగన్ తేల్చి చెప్పడంతో దగ్గుబాటి వైసీపీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఎటూ తేల్చకుండా సైలెంటైపోయారు. తాజా పరిణామాలతో ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయ ప్రస్థానం వైసీపీలో ముగిసిపోయినట్టే అంటున్నారు. మరోసారి దగ్గుబాటి రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనని ప్రచారం జరుగుతోంది.