గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావ్ స్పందించారు. తాను సీఎం జగన్‌కి విధేయుడిని అని.. ఆయన చెప్పినట్టు నడుచుకుంటానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే తాను పార్టీలోకి వచ్చాను తప్ప మరొకరి కోసం కాదన్నారు. వంశీ వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నారా? అన్న ప్రశ్నను ఆయన దాటవేశారు. వంశీ పార్టీలో చేరాక ఆ సంగతి చూద్దామన్నారు.జగన్మోహన్ రెడ్డి పథకాలకు ఆకర్షితులై వస్తున్నారో.. లేక కేసుల వేధింపుల వల్లేవస్తున్నారో తనకు తెలియదన్నారు. ఒకవేళ గన్నవరంలో ఉప ఎన్నిక వస్తే పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు.. అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తారని చెప్పారు.
అయితే జగన్మోహన్ రెడ్డిపై తనకు అచంచల విశ్వాసం ఉందని తెలిపారు. జగన్‌తో పనిచేయాలన్న ఉద్దేశంతోనే అమెరికా నుంచి వచ్చేశానని.. తనకు అన్యాయం చేస్తాడని భావించట్లేదన్నారు. తాను క్యారెక్టర్ ఉన్న మనిషిని అని.. పార్టీలు మారే మనస్తత్వం తనకు లేదని అన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు వంశీ పంచిన ఇళ్ల పట్టాలు మాత్రం నకిలీవేనని అన్నారు. ఆ 12వేల మంది లబ్దిదారులకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలను ఇప్పుడు తాము ఇవ్వబోతున్నామని చెప్పుకొచ్చారు.