ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ తరఫున పిలిచిన ఎలక్ట్రికల్ బస్సుల టెండర్లను రద్దు చేసినట్టు తెలిసింది. ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయడానికి కొన్ని రోజుల ముందే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 1000 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తొలుత నిర్ణయించారు. అందులో తొలిదశలో 350 బస్సులను తీసుకోవాలనుకున్నారు. దీనికి సంబంధించిన టెండర్లు కూడా పిలిచారు. కానీ, చివరినిమిషంలో ఆ టెండర్లను రద్దు చేసినట్టు సమాచారం.
ఒక్కో ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు సుమారురూ.2కోట్లు ఉంటుంది. దేశంలో కేవలం ఏడు కంపెనీలు మాత్రమే ఎలక్ట్రికల్ బస్సులను తయారు చేస్తున్నాయి. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయా కంపెనీలకు పెద్ద ఎత్తున ఆర్డర్స్ ఉన్నాయి. ఈ క్రమంలో బస్సుల డెలివరీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు బస్సులను తీసుకున్నా.. వాటికి చార్జింగ్, ఇతర మెయింటెనెన్స్ పరికరాలు ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంత పెద్ద భారాన్ని మోయడం ఇబ్బందేనని అధికారులు సీఎం జగన్‌కు సూచించారు.