కోల్‌కతాలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఓ భవనం నుంచి బుధవారం ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఆరో అంతస్తులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నహాక్ మర్చంటైల్ సంస్థ కిటికీ నుంచి కరెన్సీ నోట్లు కుప్పలు తెప్పలుగా కిందపడ్డాయి. దాంతో అక్కడున్నవారు వాటిని ఏరుకోవడానికి ఎగబడ్డారు. అదే సమయంలో ఆ సంస్థలో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం గమనార్హం. సోదాలు జరుగుతున్న సమయంలోనే నోట్లు కిటికీ నుంచి బయటకు ఎవరు విసిరేశారన్నది తెలియరాలేదు. కిందపడ్డ నోట్లలో రూ.2000, రూ. 500, రూ. 100 ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. డీఆర్ఐ తనిఖీలపై ఆరా తీశారు. కరెన్సీ నోట్లకు,సోదాలకు సంబంధం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.