తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి గందరగోళంగా మారింది. 47 రోజుల పాటు సమ్మె చేసినా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే బేషరతుగా విధుల్లో చేర్చుకుంటే సమ్మె విరమిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఇరు వర్గాలనుంచి మళ్లీ ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ చాలామంది కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్దమైపోయారు. ఇన్నాళ్లు జేఏసీ మార్గదర్శకత్వంలో సమ్మె బాట పట్టిన కార్మికులు.. ఇక నాయకత్వం ఆదేశాల కోసం వేచి చూడకుండా విధుల్లో చేరేందుకే మొగ్గుచూపుతున్నారు.
శుక్రవారం తెల్లవారుజామునే చాలామంది ఆర్టీసీ కార్మికులు యూనిఫాం ధరించి విధుల్లో చేరేందుకు ఆయా డిపోల వద్దకు చేరుకున్నారు. అయితే ఉన్నతాధికారుల నుంచి తమకెలాంటి ఆదేశాలు లేవని డిపో మేనేజర్లు వారిని వెనక్కి తింపి పంపిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు వేచి చూస్తే.. అధికారుల నుంచి ఆదేశాలు వచ్చి అవకాశం ఉందని.. అప్పటివరకు ఆగాలని కార్మికులకు వారు చెప్పినట్టు సమాచారం. కార్మికులు డిపోల వద్దకు చేరుకుంటుండటంతో పోలీసులను కూడా భారీగానే మోహరిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.