ఆమె పేరు గుడ్డి. రాజస్థాన్… చురు జిల్లాలో భర్తతో కలిసి నివసిస్తోంది. ఇప్పటికే 11 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఆమె… తాజాగా నవంబర్ 20న మగ బిడ్డకు జన్మనిచ్చింది. మగ బిడ్డ కోసం ఎందుకు అంత ఆరాటం? ఆడ పిల్లలంటే చిన్నచూపా అని ప్రశ్నించింది. దానికి ఆ ఫ్యామిలీ చెప్పిన సమాధానం ఈ దేశంలో ఇప్పటికీ ఉన్న అనాలోచిత పరిస్థితులను బయటపెడుతోంది. గుడ్డి ఎంత మంది ఆడ పిల్లల్ని కన్నా… ఆమెకు మగ బిడ్డ పుట్టట్లేదనీ, ఆమెలో ఏదో లోపం ఉందనీ… స్థానికులు, చుట్టుపక్కల వాళ్లు, ఊరి పెద్దలూ అందరూ రకరకాలుగా మాట్లాడేవాళ్లు. ఆ సూటిపోటి మాటలు ఆమెతోపాటూ… ఆమె భర్త కృష్ణ కుమార్ కూడా భరించలేకపోయేవాడు. ఎన్నేళ్లైనా అవే అవమానాలు. ఈ రోజుల్లో ఒక్క బిడ్డను కనేందుకే చాలా మంది ఇష్టపడట్లేదు. అలాంటిది ఊళ్లో వాళ్ల మాటలు పడలేక… గుడ్డి… ఏకంగా 11 మంది పిల్లల్ని కని… 12వ సారి… మగబిడ్డ పుట్టడంతో… దేవుడు దయ తలిచాడని ఆనందపడుతోంది.
మధ్యప్రదేశ్‌లో 2017 ఫిబ్రవరిలో ఇలాంటి కేసే జరిగింది. అక్కడ ఓ మహిళ… 10 మంది ఆడపిల్లలు పుట్టాక… 11వ సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. మన దేశంలోని కొంతమంది ఆలోచనా ధోరణి మారాలి. అమ్మాయైనా, అబ్బాయైనా ఎవరు పుట్టినా ఒకటే అనే వాస్తవం వారికి తెలిసిరావాలి. అసలే మన దేశంలో ఆడ పిల్లల సంఖ్య బాగా తక్కువగా ఉంది. ప్రభుత్వాలు ప్రజల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి.