మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయబోతున్న శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. ఈ కీలక ఘట్టానికి కొన్ని గంటల ముందు కీలక పదవి నుంచి తప్పుకున్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్‌కి ఆ బాధ్యతలు అప్పగించారు. 2002లో సామ్నా సంపాదకుడిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అదే సంవత్సరం బృహన్‌ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో శివసేన తిరుగులేని విజయం సాధించింది. 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఉద్దవ్ థాక్రేను.. 2004లో తన రాజకీయ వారసుడిగా బాల్ థాక్రే ప్రకటించారు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఒక్కసారి కూడా పోటీ చేయని ఉద్దవ్.. థాక్రే కుటుంబం నుంచి సీఎం కాబోతున్న మొట్టమొదటి వ్యక్తి కావడం విశేషం.