వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. స్వీయ నిర్మాణంలో తన శిష్యుడు సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్ పై వివాదం నెలకొనడంతో ఈ సినిమాకు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. ఈ చిత్రంలో ఏపీ పొలిటికల్ స్క్రీన్‌లోని ముఖ్యమైన పాత్రలను తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు వర్మ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ద్వారా సీఎం జగన్, చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ సహా అందరి క్యారెక్టర్లను చూపించబోతున్నట్టు వర్మ పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ఆఖరికి కేంద్రంలోని మోదీ, అమిత్ షాలను సైతం వదల్లేదు. అయితే ఇంత మంది పాత్రలను తెరపై చూపించేందుకు సిద్ధమైన వివాదాల వర్మ… టీడీపీలో అత్యంత కీలకమైన బాలకృష్ణ పాత్రను ఈ సినిమా ట్రైలర్‌లో చూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.