మళ్ళి కొండెక్కి కూర్చున్న ఉల్లి ధర.

0
91

ఉల్లి ధర సామాన్యుడిని కన్నీళ్లు పెట్టిస్తోంది. కిలో రూ.110 పలుకుతుండటంతో ఉల్లి లేకుండానే వంటలు కానిచ్చేస్తున్నారు. ఏడాదికోసారి ఉల్లి ఇలా కొండెక్కి కూర్చుంటుండటం సామాన్యులను గుదిబండగా మారుతోంది.ఈ నేపథ్యంలో ఉల్లిపై బీహార్ ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తోంది. కిలో రూ.35కి ఉల్లిగడ్డను విక్రయిస్తోంది. బీహార్ స్టేట్ కార్పోరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ ద్వారా ఉల్లిగడ్డలను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని అందజేస్తోందని తెలియగానే..జనం కౌంటర్ల వద్దకు క్యూ కట్టారు. భారీగా జనం పోటెత్తడంతో ఉల్లి విక్రయదారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ తమకు దొరకలేదన్న ఆగ్రహంతో రాళ్ల దాడి చేస్తారేమోనని.. హెల్మెట్లు పెట్టుకుని మరీ విక్రయిస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో, సచివాలయం తదితర ప్రాంతాల్లో సబ్సిడీ ఉల్లిని విక్రయిస్తున్నారు. ఉల్లి విక్రయ కేంద్రాల వద్ద తొక్కిసలాటలు,రాళ్ల దాడులు జరిగే అవకాశం ఉండటంతో.. ముందు జాగ్రత్తలో భాగంగా హెల్మెట్లు పెట్టుకుని విక్రయిస్తున్నట్టు బిస్కమౌన్ అధికారి రోహిత్ కుమార్ తెలిపారు. విక్రయదారులకు ప్రత్యేకంగా ఎటువంటి సెక్యూరిటీ కల్పించకపోవడంతో ఇలా హెల్మెట్లు పెట్టుకుని విక్రయిస్తున్నారని చెప్పారు.