తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్‌కౌంటర్ చేశారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణలో భాగంగా దిశ మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్ ప్రాంతంలో క్రైమ్ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్ కు ప్లాన్ చేసారు. ఈ నేపధ్యంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చిచంపారు.
తాజా ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. దిశకు న్యాయం జరిగింది, కానీ నిర్భయ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దిశ చనిపోయిన ఎనిమిది రోజుల్లోనే పోలీసులు న్యాయం చేశారు. కానీ నా బిడ్డ చనిపోయి ఏడేళ్లు అవుతోంది. అయినా కనీస న్యాయం జరగలేదు. ఏడేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఉరిశిక్ష పడింది కానీ అది ఇంత వరకు అమలు కాలేదు. శిక్ష అమలు జరిగే వరకు పోరాడుతూనే ఉంటా. దిశ కేసులో పోలీసుల తీరును స్వాగతిస్తున్నా. ఎన్‌కౌంటర్ జరిపిన పోలీసులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవద్దు. ఆమె ఆత్మకు ఎట్టకేలకు శాంతి జరిగింది అని అన్నారు.
దిశ హత్యాచార కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం సమర్థనీయమే అని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ను సీపీఐ సమర్థిస్తుందని పేర్కొన్నారు. దిశ హత్యచారం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలు సమర్థనీయమే అని ఆయన తెలిపారు.
దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పారిసిలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఇక గతంలో ఓ యువతి పై వరంగల్ లో జరిగిన ఆసిడ్ దాడిలో నిదితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు వరంగల్ ఎస్పి గా సజ్జనార్ వున్నారు. ప్రస్తుతం దిశ నిందితులను కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు కూడా సైబరాబాద్ సిపి గా సజ్జనార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్ పై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.