భగ్గుముంటున్న రైతులు… జగన్ ప్రకటనకు నిరసనగా పలు గ్రామాలలో బంద్…

0
87

రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రతిపాదనపై సీఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటనపై రాజధాని అమరావతి పరిధిలోని రైతులు భగ్గుముంటున్నారు. సీఎం ప్రకటనకు నిరసనగా గురువారం రాజధానిలోని 29 గ్రామాల ప్రజలు బంద్‌కు పిలుపునిచ్చారు. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా ఇంతవరకు ప్లాట్లు అప్పగించలేదని, మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బంద్ పిలుపు మేరకు రాజధాని గ్రామాల ప్రజలు బంద్‌కు పిలుపునివ్వగా..ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.

దీంతో ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రైతుల బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా వ్యాపార, విద్యాసంస్థలను మూసివేశారు. వెలగపూడిలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి రోడ్ల దిగ్బంధం, వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలను జారీ చేస్తున్నట్లు తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో రాజధాని అంశంపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా సచివాలయం వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తుళ్లూరు, మందడం, మంగళగిరిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.