ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష ప్రారంభించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్షకు దిగారు. కొంతమంది బీజేపీ నేతలు కూడా ఆయనతోపాటూ దీక్షలో పాల్గొన్నారు. రాజధాని శంకుస్థాపన పవిత్ర మట్టికి పూజలు చేసి… కన్నా ఈ దీక్ష మొదలుపెట్టారు. గంట పాటు ఆయన దీక్ష చెయ్యనున్నారు. దీక్షా శిబిరం దగ్గరకు అమరావతి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. గత ప్రభుత్వం అధికారికంగా అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు… దానికి కేంద్రం భూమిపూజ చేసినప్పుడు… ప్రస్తుత ప్రభుత్వం రాజధానిని మార్చాలనుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు కన్నా.
మరోవైపు రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది TNSF. బొత్స వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ… ఆయన ఇంటిని ముట్టడించింది. ఐతే… ఆల్రెడీ అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అమరావతిలోని 29 గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు… పహారా కాస్తున్నారు. రైతుల్ని ఆందోళనలు చెయ్యనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఐతే తుళ్లూరులో రైతులు పదో రోజు ధర్నా కొనసాగిస్తున్నారు.