వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 2019లో తెలుగునాట మార్మోగిన పేరు ఇది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంతో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి తెలుసుకోవడానికి భారతీయులే కాదు.. విదేశీయులు కూడా ఆసక్తి చూపారనడం అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో.. జగన్ విజయం సాధించారు. ప్రతిపక్ష నేతగా 2019 సంవత్సరాన్ని ప్రారంభించిన జగన్.. 151 స్థానాల్లో విజయం సాధించి.. బలమైన సీఎంగా అవతరించారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు. 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభించిన జగన్.. 341 రోజులపాటు 3648 కి.మీ. దూరం నడిచారు. 2019 ఆరంభంలో ‘ప్రజా సంకల్ప యాత్ర’ను ముగించారు. మీ ప్రేమ నన్ను గెలిచింది.. మీ బాధ నన్ను కదిలించింది.. మీ ఆశ నాలో స్ఫూర్తి నింపింది.. మీకు సేవ చేయాలనే నా సంకల్పం మరింత బలోపేతమైందంటూ.. పాదయాత్ర ముగింపు సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా విషయంలో బాబు పదే పదే మాట మార్చిన తీరును జనానికి అర్థమయ్యేలా చెప్పగలిగారు. రావాలి జగన్, కావాలి జగన్… అంటూ జనం గళం ఎత్తి పలికేలా చేయడంలో వైఎస్సార్సీపీ వ్యూహకర్తలు సఫలీకృతమయ్యారు. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన నవరత్నాలు హామీకి మేనిఫెస్టోలో ప్రాధాన్యం దక్కింది. తాను అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తిరిగి తెస్తానని జగన్ ప్రజలకు మాటిచ్చారు.
2014 ఎన్నికల్లో కొద్ది తేడాతో అధికారానికి దూరమైన జగన్.. 2019లో ఎలాంటి తప్పిదానికి ఆస్కారం ఇవ్వలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకున్నారు. ప్రతి ఓటు విలువైందేనని గుర్తించి.. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకున్నారు. ఎన్నికల ముందు వరకూ ఎక్కడా అలసత్వం వహించలేదు. దీంతో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ సీట్లను వైఎస్సార్సీపీ ఖాతాలో వేసుకుంది. ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. ప్రతి ఇద్దరిలో ఒకరు వైఎస్సార్సీపీకే ఓటేశారు.