అమరావతిలో రైతుల ఆందోళన. మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా నేడు రాజధాని బంద్‌.

0
36

అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా నేడు రాజధాని బంద్‌కు రైతులు, రైతు కూలీలు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమ పట్ల పోలీసులు అనైతికంగా వ్యవహరించారని మహిళలు మండిపడ్డారు. తమ పోరును మరింత ఉద్ధృతం చేస్తామని రాజధాని అమరావతి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అయితే రైతులు పోలీసులు మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాజధాని గ్రామాల రైతులు నిర్ణయించుకున్నారు. వాళ్లకు కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా కల్గించకూడదనుకున్నారు. తమ దుకాణాల ముందు కూర్చోవడానికి కూడా పోలీసులకు అనుమతి ఇవ్వడం లేదు.

దీంతో పోలీసులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు పోలీసులు ఆందోళనలు చేస్తున్న రైతుల కాళ్లు పట్టుకుున్నారు. శుక్రవారం మహిళల పట్ల ప్రవర్తించిన అనుచిత తీరుకు క్షమాపణలు చెప్పారు. కాళ్లు పట్టుకొని తమను క్షమించాలని కోరారు.  శుక్రవారం  సకల జన సమ్మెలో భాగంగా మందడంలో ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు విచక్షణ మరిచి విరుచుకుపడ్డారు. మహిళలను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు. కాగా ప్రజలు పోలీసు వ్యాన్‌ను అడ్డుకొని తీవ్ర నిరసన తెలిపారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు మహిళలు వదిలిపెట్టిన విషయం తెలిసిందే.