నోటి దురుసుతనంతో వార్తల్లో నిలిచే సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మరోసారి తన నోటికి పనిచెప్పాడు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు బాలయ్యపై పడ్డాడు. నిన్న శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్యతో రోజా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటో తెలుగునాట సంచలనంగా మారింది. టీడీపీపై, చంద్రబాబుపై విరుచుకుపడే రోజా.. బాలయ్యతో ఫోటో దిగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. ఆ ఫోటోను చూసిన ఆర్జీవీ.. బాలయ్యపై సెటైర్లు వేశాడు.
‘సెల్ఫీలో రోజా హీరోలా కనిపిస్తోంది. ఆమె పక్కన ఎవరోగానీ అసహ్యంగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో రోజా అందాన్ని అతడు పాడు చేస్తున్నాడు. నాకు తెలిసి రోజాకు అతడు దిష్టి బొమ్మ కావచ్చు’ అని సంచలన ట్వీట్ చేశాడు. మరో ట్వీట్లో ‘అందమైన రోజా పక్కన కూర్చొని ఆ ఫోటోను పాడు చేసిన వ్యక్తి ఎవరో చెప్పగలరా’ అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా.. రోజా, బాలకృష్ణ బంధం ఈనాటిది కాదు. వీరిద్దరు కలిసి దాదాపు అరడజనుకు పైగా సినిమాలు చేశారు. కాగా.. ఒక విధంగా చెప్పాలంటే రోజాకు రాజకీయ గురువు బాలయ్యనే అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రోద్భలంతోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ తీర్థం పుచ్చుకొని, ఆ తర్వాత పార్టీ మారిన సంగతి తెలిసిందే.