త్వరలోనే తెలంగాణకు కేటీఆర్ సీఎం.. విజయశాంతి సంచలన వాఖ్యలు..

0
60

త్వరలోనే తెలంగాణకు కేటీఆర్ సీఎం అవుతారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని కేటీఆర్ స్వయంగా ఖండించినా… టీఆర్ఎస్ నేతలు మాత్రం కేటీఆర్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రచారంపై కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి స్పందించారు. మున్సిపల్ ఎన్నికల తీరుపై కాంగ్రెస్‌కు చెందిన జిల్లా నేతలు కొంతమందిని ప్రశ్నిస్తే… గతంలో మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అధిక సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని చెబుతున్నారని ఆమె తెలిపారు. ఒకవేళ అదే గనక జరిగితే… ఆ క్రెడిట్‌ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఖాతాలో వేయాలని టిఆర్ఎస్ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోందని అన్నారు.

ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా అటు ప్రతిపక్ష నేతలు కొందరు కేటీఆర్ గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయబోతున్నారనే ప్రచారానికి మరింత ఆజ్యం పోశారని విజయశాంతి పేర్కొన్నారు. టిఆర్ఎస్ నేతలు కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెబితే దానిని ఎవరూ పట్టించుకోరని, కానీ ప్రతిపక్షాలకు చెందిన నేతలు సైతం కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చేస్తున్న ప్రచారం వల్ల ఆయన ఇమేజ్ ప్రజల్లో బాగా పెరుగుతుందనడంలో సందేహం లేదని రాములమ్మ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా.. టిఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి ఎంపిక అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని విజయశాంతి వెల్లడించారు.