మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను బయటపెట్టింది ‘మీటూ’ ఉద్యమం.

0
81

ప్రొఫెషనల్ కెరీర్‌లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను బయటపెట్టింది ‘మీటూ’ ఉద్యమం. పలు రంగాలకు చెందిన చాలా మంది మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. ఎంతో మంది ప్రముఖులకు ‘మీటూ’సెగ తగిలింది. వీళ్లలో మీడియా ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా మరో మీడియా ప్రముఖుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ9 హిందీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. టీవీ9 భారత్‌వర్ష్ పేరిట హిందీ న్యూస్ ఛానెల్‌ను కిందటేడాది మార్చిలో ప్రారంభించారు. ఈ ఛానెల్ ఔట్‌పుట్ డివిజన్ నోయిడాలో ఉంది. ఈ డివిజన్‌లో ఔట్‌పుట్ ఎడిటర్‌గా పనిచేస్తోన్న అజయ్ ఆజాద్‌పై తాజాగా లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. ఛానెల్‌లో పనిచేస్తోన్న ఇద్దరు మహిళలు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఒక మహిళ ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లో ఇంకో మహిళ ఫిర్యాదు చేయడం గమనార్హం. అజయ్ తమను లైంగికంగా వేధించారని, బెదిరించారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.

దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీవీ9 యాజమాన్యం కంపెనీ నియమ నిబంధనల ప్రకారం ఫిర్యాదులను వెంటనే ఇంటర్నల్ కమిటీని పంపింది. విచారణ జరుగుతున్న రోజుల్లో అజయ్‌ను సెలవుల మీద బయటకు పంపేశారు. అయితే, అజయ్ ఆజాద్ శుక్రవారం నాడు తన పదవికి రాజీనామా చేసినట్టు టీవీ9 భారత్‌వర్ష్ ప్రకటించింది. అజయ్ రాజీనామాను యాజమాన్యం వెంటనే ఆమోదించిందని పేర్కొంది.