రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. జీరో సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ సినిమాలు చేయలేదు ఈయన. వరస పరాజయాలతో డీలా పడిపోయింది షారుక్ కెరీర్. ఇలాంటి సమయంలో ఆయన ఇంట్లో అనుకోని విషాదం చోటు చేసుకుంది. షారుక్ సోదరి నూర్జాహాన్ కన్నుమూసింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈమె జనవరి 29న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మరణించింది. షారుక్ పూర్వీకులకు పాకిస్తాన్. ఆయన తండ్రి కూడా చనిపోయేంత వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఇండియాకు వచ్చాడు. కానీ షారుక్ కుటుంబీకులు ఇంకా కొందరు పాకిస్తాన్‌లోనే ఉన్నారు.
ఆయన సోదరి నూర్జహాన్ కూడా పెషావర్‌లోనే ఉన్నారు. అక్కడి కిస్సా ఖ్వానీ బజార్ సమీపంలోని మొహల్లా షా వాలి కతాల్ ప్రాంతంలో నూర్జాహాన్ తన భర్త అసిఫ్ బుర్హాన్‌తో కలసి నివసిస్తుంది. అయితే ఈ మధ్యే ఆమెకు నోటి క్యాన్సర్ అటాక్ అయింది. ఆ తర్వాత ఆమెకు చికిత్స అందించినా కూడా లాభం లేకుండా పోయింది. కొన్ని రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్న ఈమె జనవరి 29న పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. అయితే నూర్జాహాన్ షారుక్ సొంత సోదరి కాదు.. ఆయన తండ్రి షారుక్‌కు చిన్నాన్న అవుతారు. మొత్తానికి సోదరి చనిపోవడంతో షారుక్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.