మరో పదేళ్లు తానే సీఎం… ఎంపీ సంచలన వ్యాఖ్యలు.

0
49

మంత్రి కేటీఆర్‌ను సీఎం చేస్తే, కేబినెట్ సహకరించదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రభుత్వం కూలుతుందని, ఈ విషయం తమకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిందని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, మరో పదేళ్లు తానే పదవిలో ఉంటానని ప్రెస్ మీట్‌లో చెప్పారని అన్నారు. ధర్మపురి అర్వింద్‌తో కలిసి బండి సంజయ్ ఢిల్లీలో మీడియా‌తో మాట్లాడారు. “ఎప్పుడూ కొడుకు సీఎం, తండ్రి పీఎం అనే తపన తప్ప, రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి, మతం కోణంతో విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు సీఏఏకు వ్యతిరేకమని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సీఏఏ విషయంలో దేశంలో ఏదో జరుగుతోందని కేసీఆర్ మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. విపక్షాలు, సీఎం కేసీఆర్ ముస్లింలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్నారని ఆరోపించారు. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ బాంబు పేలుళ్లతో అమాయక ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న పాక్ ఉగ్రవాదులకు పౌరసత్వాన్ని టీఆర్ఎస్ ఇవ్వాలనుకుంటుందా అని ప్రశ్నించారు. బైంసా ఘటనను గల్లీ లొల్లిగా అభివర్ణించిన కేసీఆర్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదన్నారు.