అసోం నదిలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు.

0
35

అసోంలో ఓ నదికి భారీగా మంటలు అంటుకున్నాయి. దిబ్రూగఢ్ జిల్లాలోని బుర్హి దింగ్ నది కింది భాగం నుంచి వెళుతున్న ఆయిల్ పైప్‌ పేలిపోవడంతో మంటలు అంటుకున్నాయి. నది అంతర్భాగంలోని పైపులైన్ పేలిపోవడంతో ఉపరితలంపై పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దిబ్రూగఢ్ జిల్లా నహర్కాటియా సమీపంలోని ససోనీ గ్రామం వద్ద పైపులైన్ నుంచి ఆయిల్ బయటకు వచ్చి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. బుర్హి దింగ్ నది నుంచి దులియాజాన్‌లోని ఆయిల్ ఇండియా ప్లాంట్‌కు పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.

ఈ పైప్‌లైన్ నుంచే నదిలోకి ఆయిల్ రావడంతో దీనిని గమనించి కొందరు ఆకతాయిలు నిప్పంటించారని స్థానికులు తెలియజేశారు. మూడు రోజుల కిందటే మంటలు ఎగిసిపడుతున్న విషయం గురించి అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. అయినా, మంటలను అదుపుచేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. క్రమంగా నదిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోనూ ఓఎన్‌జీసీ బావిలో గ్యాస్‌ లీకవుతోంది. దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. గాలి ఎటువీస్తే అటు వైపు గ్యాస్‌ మళ్లుతుండటంతో పరిసర ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఫిబ్రవరి2వ తేదీ ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఓఎన్‌జీసీ బావి నుంచి ఒక్కసారిగా గ్యాస్‌ పెద్ద శబ్దంతో ఎగసిపడింది. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న పీఎఫ్‌హెచ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు గ్యాస్‌ను అదుపుచేసే యత్నం చేశారు.