చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇతర దేశాలకు కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే భారత్ సహా 25 దేశాల్లో కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. భారత్‌లో మూడు కరోనా కేసులు నిర్ధారణ కాగా…వీరు ముగ్గురూ కేరళకు చెందిన వారే. ఇటీవల వీరందరూ చైనాలోని వుహాన్ నగరం నుంచి అక్కడకు వచ్చారు. ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో ప్రమాదఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారినపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కాటుకు చైనాలో మృతి చెందిన వారి సంఖ్య 425కు చేరింది. మంగళవారం ఉదయం వరకు ఆ దేశంలో 20,438 కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు ఆ దేశంలో మృతుల సంఖ్య 361, నిర్ధారణ అయిన కరోనా కేసుల సంఖ్య 17,205గా ఉంది. గత 24 గంటల వ్యవధిలో మరో 64 మంది కరోనా వైరస్ బాధితులు మృత్యువాతపడ్డారు. మరో 3233 కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా వ్యాధి లక్షణాలున్న వారికి నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలు ఇంకా అందలేదు. ఈ నివేదికలు కూడా అందితే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది.

కరోనా వైరస్ బాధితుల కోసం చికిత్స కల్పించేందుకు 10 రోజుల్లోనే 1000 పడకలతో కూడిన భారీ ఆస్పత్రిని చైనా నిర్మించింది. ఇందులోని కరోనా వైరస్ బాధితులకు చికిత్స కల్పిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే 1500 పడకల వసతి కలిగిన మరో ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. కరోనా వైరస్ దెబ్బకు చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతోంది. గబ్బిలాల నుంచే కరోనా వైరస్ వచ్చిందని నిర్ధారించే మరిన్ని ఆధారాలు లభించినట్లు చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దక్షిణ కొరియాలో 15 కరోనా కేసులు నిర్ధారణ కాగా…ఇటీవల చైనా, హాంకాంగ్, మొరాకోలో పర్యటించిన 800 సైనికులను ప్రత్యేక ప్రాంతంలో ఉంచి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇతరుల ద్వారా కరోనా వైరస్ వీరికి వ్యాపించి ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌తో ఫిలిప్పీన్స్‌లో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. చైనా దేశానికి బయట నమోదైన తొలి కరోనా వైరస్ మరణం ఇదే. ఆ దేశంలో మరో రెండు కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో చైనా నుంచి తమ పౌరులుకాని వారు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఫిలిప్పీన్స్ నిషేధించింది. కరోనా వైరస్ విషయంలో అమెరికా తీరుపై చైనా మండిపడింది. కరోనాపై అమెరికా అనవసర భయాందోళనలు వ్యాపింపజేస్తోందని ఆరోపించింది. ఆందోలన చెందాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా..అమెరికా అనవసర భయాందోళనలు సృష్టిస్తోందని ధ్వజమెత్తింది.