హాంకాంగ్‌ను వణికిస్తున్నతొలి కరోనా వైరస్ మరణం

0
75

చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ హాంకాంగ్‌ను హడలెత్తిస్తోంది. ఆ దేశంలో తొలి కరోనా వైరస్ మరణం నమోదైంది. చైనాకు బయట ఇది రెండో కరోనా వైరస్ మరణం. సోమావారం ఓ వ్యక్తి ఫిలిప్పీన్స్‌లో ఈ కొత్త వైరస్ కాటుకు మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ కాటుకు తొలి మరణం నమోదుకావడంతో హాంకాంగ్ చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు బయటి వ్యక్తులు హాంకాంగ్‌లోకి ప్రవేశించకుండా మూడు సరిహద్దు ఎంట్రీలు మినహా మిగిలిన అన్నిటినీ మూసేస్తున్నట్లు హాంకాంగ్ నేత చెర్రీ లామ్ ఇప్పటికే ప్రకటించారు. అంతకు ముందు హాంకాంగ్‌లోకి వచ్చే అన్ని ఎంట్రీలని మూసివేయాలని డిమాండ్ చేస్తూ 2000 మంది ఆస్పత్రి సిబ్బంది విధులు బహిష్కరించారు.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇతర దేశాలకు కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే భారత్ సహా 25 దేశాల్లో కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. భారత్‌లో మూడు కరోనా కేసులు నిర్ధారణ కాగా…వీరు ముగ్గురూ కేరళకు చెందిన వారే. ఇటీవల వీరందరూ చైనాలోని వుహాన్ నగరం నుంచి అక్కడకు వచ్చారు.దక్షిణ కొరియాలో 15 కరోనా కేసులు నిర్ధారణ కాగా…ఇటీవల చైనా, హాంకాంగ్, మొరాకోలో పర్యటించిన 800 సైనికులను ప్రత్యేక ప్రాంతంలో ఉంచి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇతరుల ద్వారా కరోనా వైరస్ వీరికి వ్యాపించి ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు.