చైనాలో 20వేల మందిని ఆవహించిన కరోనా దాదాపు 500 మందిని పొట్టనబెట్టుకుంది. ఇది సుమారు 25 దేశాలకు విస్తరించి మానవాళి గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఈ మహమ్మారి అంతానికి మందు లేదు. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్‌ను తయారు చేసే పరిస్థితులూ తక్కువే. కట్టడి చేసేందుకు ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. అయితే.. కొన్ని ఆయుర్వేద పద్ధతుల ద్వారా వైరస్‌ను చంపేయొచ్చని, అది సోకకుండా జాగ్రత్త పడవచ్చని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా యాంటీ మైక్రోబయాల్ లక్షణాలున్న వెల్లుల్లితో వైరస్ భరతం పట్టొచ్చని న్యూస్ వైరల్ అవుతోంది.

ఇందులో ఎంత నిజం ఉంది..? నిజంగానే వెల్లుల్లితో వైరస్‌ను అంతం చేయొచ్చా..? తదితర ప్రశ్నలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)వివరణ ఇచ్చింది. ‘వెల్లుల్లి ఆరోగ్యకర ఆహారం. ఇందులో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉండొచ్చు. అయితే, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉండవచ్చన్న దానికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం లేదు.’ అని స్పష్టం చేసింది.