నేడు గద్దెపైకి రానున్న సమ్మక్క .

0
59

తెలంగాణా కుంభమేళగా చెప్పుకునేది మేడారం జాతర. ఈ మేడారం భక్త జన సంద్రమైంది.. జంపన్న వాగులో జలకాలాటలు, కోళ్లు, గొర్రెల బలులు, తలనీలాలు.. బంగారు బెల్లం సమర్పణ.. ఇలా వనంలోకి వెళ్లిన జనం భక్తితో పులకించిపోతున్నారు. మేడారం నలుదిక్కులు శివనామస్మరణతో, అమ్మవార్ల భజనలతో మార్మోగిపోతున్నాయి. బుధవారం నాడు ప్రారంభమైన మహా జాతరలో సారలమ్మ, పగిడిద్ద, గోవింద రాజులు గద్దె పైకి చేరడంతో అద్భుత ఘట్టం పూర్తవగా.. సమ్మక్క తల్లి గద్దెపైకి రానున్న కీలక ఘట్టం నేడు జరగనుంది. కొండాయి నుంచి 15 కిలోమీటర్ల దూరం మేర కాలినడన ప్రయాణించి మేడారానికి పడిగ రూపంలో విచ్చేసిన గోవిందరాజుతో పాటు సారలమ్మ, పగిడిద్దరాజులను అర్ధరాత్రి 12గంటల తర్వాత గద్దెల మీద ప్రతిష్ఠించారు. అంతకుముందు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా.. ఈ రోజు చిలకల గుట్టపై కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను మేడారానికి ఊరేగింపుగా తీసుకురానున్నారు. గద్దెపైకి సమ్మక్క చేరే అద్భుత, అపురూప ఘట్టంతో జాతర ప్రాంగణం మరింత శోభాయమానంగా రూపుదిద్దుకోనుంది. సాయంత్రం 6-7 గంటల మధ్య పూజారులు సమ్మక్క తల్లిని గద్దెపై ప్రతిష్ఠిస్తారు.