చైనాలో కోవిడ్ ఉగ్రరూపం. రోజు రోజుకి పెరుగుతున్న మృతుల సంఖ్య.

0
68

చైనాలో కోవిడ్-19 వైరస్ మరింత ఉద్ధృతమవుతోంది. బుధవారం ఒక్క రోజే కరోనా వైరస్ కారణంగా 242 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15,000 కొత్త కేసులు నమోదయినట్టు చైనా అధికారులు తెలిపారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,355కి చేరింది. కరోనా బాధితుల సంఖ్య 60,000 దాటినట్టు హుబే హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఈ ప్రావిన్సుల్లో కొత్తగా 14,840 మంది బాధితులను గుర్తించనట్టు తెలిపారు. ఇప్పటి వరకు పదుల్లోనే ఉన్న మృతుల సంఖ్య ఒక్క రోజులోనే రెట్టింపు కావడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిడ్ వైరస్ రూటు మార్చినట్టు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం 60వేల కేసులు వైద్యపరంగా నిర్ధారణ అయినట్టు హుబే హెల్త్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ అనుమానాస్పద కేసులను న్యూక్లియిక్ యాసిడ్ పరీక్షల కంటే ఊపిరితిత్తుల ఇమేజింగ్ ద్వారా నిర్ధారించవచ్చని దీని ద్వారా అర్ధమవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 60 వేల మందికిపైగా ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 10 వేల మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కొత్తరకం వైరస్‌ను కరోనాగా పిలుస్తుండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి COVID-19 (కరోనా వైరస్ డిసీజ్ 2019) అని నామకరణం చేసింది. గత ఏడాది చివర్లో ఈ వ్యాధి మొదలు కావడంతో.. సీవోఐడీ-19 అని పిలవాలని నిర్ణయించారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఉన్న భయాలను పోగొట్టడం కోసమే ఈ పేరు పెట్టామని.. దీనికి ప్రజలు, జంతువులు, ప్రదేశాలతో సంబంధం లేదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఘేబ్రెయెసస్ తెలిపారు. అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం వ్యాధి పేరు పెట్టేటప్పుడు.. ఏ భౌగోళిక ప్రాంతానికి, జంతువులకు, వ్యక్తులకు సంబంధం లేకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అది వ్యాధికి సంబంధించినదై.. తేలికగా పలికేలా ఉండాలని టెడ్రోస్ తెలిపారు.