దేవుణ్ని ఊరేగించే రథానికి నిప్పు పెట్టిన దుండగులు.. ఆందోళనలో భక్తులు..

0
28

హైందవ మతంలో… దేవుణ్ని ఎంత పవిత్రంగా భక్తులు కొలుచుకుంటారో… ఆ దేవుణ్ని ఊరేగించే రథానికి కూడా అంతే భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తారు. అలాంటిది… నెల్లూరు జిల్లా… బోగోలు మండలం కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి నిప్పుపెట్టారు దుండగులు. పెద్ద మంట వచ్చేలా నిప్పు పెట్టి పారిపోయారు. వెంటనే పెద్ద మంటలు వచ్చి రథం మొత్తం కాలిపోయింది. మంటల్ని ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించేలోపే… రథం మొత్తం కాలిపోయింది. దీనికి కారణం మీరంటే మీరు అంటూ రెండు వర్గాల ప్రజలు తిట్టిపోసుకున్నారు. వారిని శాంతపరిచిన పోలీసులు… ఓ యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐతే… ఆ పని చేసింది అతనేనా లేక ఇంకెవరైనానా అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు త్వరలో పూర్తి వివరాలు చెబుతామని తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్‌గా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. దుండగులెవరో తక్షణం గుర్తించి… వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనపై తక్షణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణిని ఆదేశించారు. అలానే ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆకతాయిలు, దుండగులు చేస్తున్న ఇలాంటి చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల పరిరక్షణకు YCP ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.
మరోవైపు కొండబిట్రకుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 5 నుంచీ వారం పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం రథాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇంతలోనే ఇలా జరగడంతో… భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో కొత్త రథం తయారీకి సమయం తక్కువగా ఉండటంతో… ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తున్నారు. తయారీదారులతో మాట్లాడి… వీలైనంత త్వరగా కొత్త రథాన్ని సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.