నేడు దివంగత నటి విజయ నిర్మల జయంతి.

0
39

గతేడాది జూన్‌లో అనంతలోకాల్లో కలిసిపోయి చిత్ర పరిశ్రమను శోకసంద్రంలోకి నెట్టారు అలనాటి తార, దర్శకురాలు విజయ నిర్మల. ఈరోజు ఆమె జయంతి. ఎందరో అభిమానుల్లో చిరకాలం నిలిచిపోయే పాత్రల్లో నటించి, అత్యధిక సినిమాలు తెరకెక్కించిన దర్శకురాలిగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
‘నీరజ’గా తెలుగు చలనచిత్ర రంగప్రవేశం చేసి విజయనిర్మలగా వినీలాకాశంలో రెపరెపలాడిన సహజనటి. ఆమె ఏకంగా 42 సినిమాలకు దర్శకత్వం వహించి అప్పటిదాకా 27 చిత్రాల రికార్డు కలిగిన ఇటలీ దర్శకురాలి పేరు చెరిపేసి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు. ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు మహిళ విజయ నిర్మల కావడం విశేషం. తెలుగులో బాలనటిగా ‘పాండురంగ మహాత్మ్యం’ (1957)లో బాలకృష్ణుడుగా నర్తించి అరవయ్యేళ్ళుగా సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని అందుకున్న నటి, దర్శకురాలు విజయనిర్మల. తన జీవిత భాగస్వామి కృష్ణతో 50 చిత్రాల్లో నటించి రికార్డు నెలకొల్పారు.

విజయనిర్మలకు టెక్నికల్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చిన చిత్రం ‘దేవుడే గెలిచాడు’ సినిమా. తరువాత నుంచి ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించారు విజయనిర్మల. అక్కినేని-కృష్ణ కాంబినేషన్లో ‘హేమాహేమీలు’, శివాజి గణేశన్‌-కృష్ణ కాంబినేషన్‌లో ‘బెజవాడ బెబ్బులి’, రజనీకాంత్‌-కృష్ణ కాంబినేషన్లో ‘రామ్-రాబర్ట్‌-రహీమ్’ చిత్రాలను డైరెక్ట్‌ చెయ్యడం విజయనిర్మల చేసిన ప్రయోగాలు. మంచి వేగం గల దర్శకురాలిగా పేరుతెచ్చుకున్న విజయనిర్మల తీసిన చిత్రాల్లో అద్భుత విజయాలతో పాటు కొన్ని పరాజయాలు కూడా లేకపోలేదు.