ఆయనకు లక్షల కోట్లున్నాయి.. చిటికేస్తే పని చేసిపెట్టే పనివాళ్లున్నారు.. విలాసవంతమైన జీవితం.. పంచభక్ష పరమాన్నాలు తినే స్థాయి.. కానీ అవేవీ ఆయన్ను సంతృప్తి పరచలేదు. మానసిక ప్రశాంతత లేక లక్షల కోట్లను వదులుకొని దేశం కాని దేశం నుంచి ఇండియాకు వచ్చి బిచ్చమెత్తుకుంటున్నాడు. స్వీడన్‌కు చెందిన కిమ్.. ధనిక పారిశ్రామికవేత్త. ఎంత డబ్బు ఉన్నా తనకు మానసిక ప్రశాంతత దొరకలేదు. దీంతో కొన్నినెలల క్రితం కోవైలోని ఈషా యోగా కేంద్రానికి వచ్చి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సహాయం చేయడం ప్రారంభించాడు. అయినా మానసిక ప్రశాంతత దొరకలేదు. దీంతో తనకు సరైన మార్గం చెప్పాలని తన గురువును కోరగా బిచ్చమెత్తుకోవాలని సూచించారు.
అంతే.. అన్నీ వదిలేసి కోయంబత్తూరు వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. దుస్తులపైనా ప్రీతి లేని ఆయన.. అర్ధనగ్నంగానే వీధుల్లో జోలెపడుతున్నాడు. రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఐదు, పది రూపాయలను తీసుకుంటున్నాడు. డబ్బున్న ఓ పారిశ్రామికవేత్త.. అన్ని వదిలేసి, భారత్‌కు వచ్చి బిచ్చమెత్తుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.