రాత్రికి రాత్రే ఢిల్లీ హైకోర్టు జడ్జి బదిలీ

0
49

ఢిల్లీ అల్లర్లపై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎస్‌.మురళీధర్‌ను రాత్రికి రాత్రే కేంద్రం బదిలీ చేసింది. ఆయన్ను పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు జడ్జిగా బదిలీచేస్తూ నోటిఫై చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 222 క్లాస్ 1 ప్రకారం సీజేఐతో చర్చించిన తర్వాత ఢిల్లీ హైకోర్టు జడ్జి మురళీధర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బదిలీ చేశారని కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మురళీధర్‌ను బదిలీచేయాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై హైకోర్టులో విచారణ సందర్భంగా.. హైకోర్టు జడ్జి మురళీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హింసను ప్రేరేపించేలా ప్రసంగాలు చేసిన నలుగురు బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మ, ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే అభయ్ వర్మ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇంకా ఎంతమంది చనిపోవాలి. ఇంకా ఎన్ని ఇళ్లు దహనమైపోవాలి. 1984 లాంటి సిక్కు అల్లర్ల పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే ఆయన్ను ట్రాన్స్‌ఫర్ చేయడంపై విపక్షాలు కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ పట్ల కఠినంగా వ్యవహరించడం వల్లే కక్ష సాధింపునకు పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. మురళీధర్ బదిలా చాలా బాధాకరమని, సిగ్గుచేటని ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రియాకం గాంధీ. ధైర్యవంతుడైన జడ్జి లోయాను గుర్తు చేసుకుంటున్నానని.. ఆయనను ఎవరూ బదిలీ చేయలేదని పరోక్షంగా మురళీధర్ ట్రాన్స్‌ఫర్‌‌ను తప్పుబట్టారు.