తాజ్‌మహల్ సహా… చారిత్రక కట్టడాలన్నింటి సందర్శనకూ బ్రేక్..

0
39

ఆగ్రా మేయర్ నవీన్ జైన్ చేసిన ఓ ప్రతిపాదన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. ఏంటంటే… తాజ్‌మహల్ సహా… చారిత్రక కట్టడాలన్నింటి సందర్శనకూ బ్రేక్ వెయ్యాలనీ, కొన్నాళ్లు వాటిని మూసివేయాలని ప్రతిపాదించారు. కరోనా వైరస్‌ను ఎంత కంట్రోల్ చేద్దామన్నా వీలవ్వట్లేదన్న ఆయన… విదేశీయుల రాక తగ్గితే తప్ప… కంట్రోల్ అయ్యేలా లేదని అన్నారు. విదేశీయులు తాజ్ మహల్ సహా… చాలా టూరిజం ప్రదేశాలకు వస్తున్నారన్న ఆయన… చారిత్రక కట్టడాలన్నీ మూసివేస్తే… పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. తాజ్ మహల్ ఉండే ఆగ్రా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం… కరోనా వైరస్ కట్టడికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ కరోనా సోకిన దేశాల నుంచీ 2915 మంది పర్యాటకులు… ఇండియా వచ్చారు. వాళ్లందర్నీ ఆగ్రా జిల్లా సర్వేలెన్స్ యూనిట్స్ కనిపెట్టి… నిఘా పెట్టాయి. వారిలో 713 మంది పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. 708 మందిని బయటతిరగొద్దనీ, ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వారిలో ముగ్గురికి కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో… వారిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్చారు. ప్రస్తుతం వాళ్లంతా నిలకడగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.
కరోనా వైరస్‌పై తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఆందోళన ఉన్న సమయంలో… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చే విషయం చెప్పింది. ఇప్పటివరకూ 27 మంది కరోనా వైరస్ అనుమానితుల నుంచీ శాంపిల్స్ సేకరించి… టెస్టింగ్ కోసం పంపగా… 20 మందికి కరోనా లేదని తేలింది. మిగతా ఏడుగురి శాంపిల్స్‌కి సంబంధించి రిపోర్ట్ రావాల్సి ఉంది. వారికి కూడా నెగెటివ్ వచ్చే అవకాశాలే ఉన్నాయని అధకారులు అనుకుంటున్నారు. ఇప్పటివరకూ 89 దేశాల్లో 3000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. వీరిలో చైనాకి చెందిన వారే చాలా మంది ఉన్నారు. లక్ష మంది దాకా కరోనా వైరస్ సోకి బాధపడుతున్నారు. మరి ఏపీలో ఇప్పటివరకూ… వేర్వేరు దేశాల నుంచీ రాష్ట్రానికి వచ్చిన 378 మందిపై అధికారులు నిఘా పెట్టారు. 153 మందిని ఇళ్లలోంచి బయటకు రావొద్దని ఆదేశించారు. 218 మందికి 28 రోజుల అబ్జర్వేషన్ పూర్తైంది. 7 గురిని ఆస్పత్రిలో చేర్చగా… వారి పరిస్థితి నిలకడగా ఉంది. అందువల్ల ఏపీలో కరోనా వైరస్ ఇప్పటివరకూ ఎవరికీ సోకలేదని అనుకోవచ్చు.