కరోన నుండి బయటపడిన టెకీ.

0
79

ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన హైదరాబాద్ టెకీ డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా రావడంతో గాంధీ వైద్యులు అతడిని శుక్రవారం (మార్చి 13) డిశ్చార్జ్ చేశారు. అయితే.. 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహీంద్రాహిల్స్‌కు చెందిన టెకీ.. కరోనా లక్షణాలతో మార్చి 1న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతడికి 9 రోజుల పాటు చికిత్స అందించారు. పూర్తిగా కోలుకోవడంతో 13 రోజుల తర్వాత అతడిని డిశ్చార్జ్ చేశారు. దేశంలో కరోనా కలకలం రేపుతున్న వేళ తెలంగాణ వాసులకు ఒక రకంగా ఇది శుభవార్తే.

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ ఆ వైరస్ తిరగబెట్టే ప్రమాదం చాలా తక్కువ అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. కరోనా వచ్చిన వారందూ చనిపోయే పరిస్థితి ఉండదని వివరించారు. 3 శాతం మంది మాత్రమే కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. మహేంద్రా హిల్స్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు మార్చి 1న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతడు దుబాయ్ వెళ్లి ఫిబ్రవరి 19న తిరిగి బెంగళూరు వచ్చాడు. ఫిబ్రవరి 22న బస్సులో హైదరాబాద్ వచ్చాడు. జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉండటంతో సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయితే ఎంతకీ తగ్గకపోవడంతో కరోనా సోకిందనే అనుమానంతో గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. అతడి నమూనాలను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. నాటి నుంచి ఐసోలేషన వార్డులో ఉంచి చికిత్స చేశారు గాంధీ వైద్యులు.

ఐదు రోజుల కిందటే అతడికి టెస్టు చేయగా కరోనా నెగటివ్‌గా వచ్చింది. స్పష్టత కోసం అతడి నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు. అక్కడ కూడా నెగటివ్ వచ్చింది. గత ఐదు రోజులుగా వరుసగా టెస్టులు చేస్తూ వస్తున్నరు గాంధీ వైద్యులు.. అన్ని పరీక్షల్లోనూ కరోనా లేదని తేలడంతో శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు.