కరోనా కష్టాలు అందర్నీ భయపెడుతున్నాయి. ఇప్పుడు హీరో నితిన్ పెళ్లికి కూడా ఈ కష్టాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈయన పెళ్లి ఇప్పుడు వాయిదా పడేలా కనిపిస్తుంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా దెబ్బకు సినిమా వాళ్లు కూడా అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే సినిమాలు వాయిదా పడుతున్నాయి.. షూటింగ్స్ ఆపేస్తున్నారు.. ఇప్పుడు నితిన్ పెళ్లి కూడా కరోనా కారణంగా వాయిదా పడేలా కనిపిస్తుంది. నాగర్‌కర్నూల్‌లోని ప్రగతి నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న డాక్టర్ సంపత్ కుమార్, నూర్జహాన్ కుమార్తె షాలినితో ఈ మధ్యే నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది. ఈ జంట త్వరలో దుబాయ్‌లోని హోటల్ పలాజో వర్సాచీలో ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

దీనికి ఏర్పాట్లు కూడా భారీగానే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పెళ్లి కొన్ని రోజులు వాయిదా వేసినట్లు తెలుస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అరబ్ దేశాల్లో కఠినమైన ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు నితిన్ పెళ్ళిని కొన్ని రోజులుగా పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ ముహూర్తం అది కాకుండా మరోటి కుదర్లేదంటే మాత్రం దుబాయ్ కాకుండా ఇక్కడే హైదరాబాద్‌లోని ఫామ్ హౌజ్‌లో అదే ముహూర్తానికి నితిన్ పెళ్లి జరపాలని చూస్తున్నారు. ఏప్రిల్ 21న హైటెక్స్‌లో ఘనంగా రిసెప్షన్ చేయనున్నారు.