శనగపిండి షర్బత్ మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తాగరు కానీ బీహార్, జార్ఖండ్‌లో చాలా ఎక్కువగా తాగుతారు. కారణం అక్కడ ఎండాకాలం వస్తే భరించలేనంత ఎండలుంటాయి. వాటి నుంచీ ఉపశమనం కోసం అక్కడి ప్రజలు ఎక్కువగా ఆధారపడే వాటిలో ఈ షర్బత్ కూడా ఉంది. ఈ డ్రింకులో ఎన్నో పోషకాలున్నాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. మిగతా కోల్డ్ డ్రింక్స్ కంటే ఇది గొప్పదే. ఇది శరీరంలో చాలా ఈజీగా కలిసిపోతుంది. సహజ సిద్ధంగా మంచి రుచితోపాటూ… తేలిగ్గా జీర్ణం అవుతుంది. అన్ని వయసుల వారూ ఈ షర్బత్ తాగొచ్చు. ఇందులోని పీచు (Fibre) పదార్థం మన పేగులకు మేలు చేస్తుంది. మనం తినే ఆహారంలో అతిగా ఉండే ఆయిల్‌ను ఇది బయటకు పంపేస్తుంది. తాగిన వెంటనే ఎనర్జీ ఇస్తుంది. మన చర్మాన్ని మెరిసేలా చేసే లక్షణం కూడా ఈ షర్బత్‌కి ఉంది. డయాబెటిస్, బీపీ ఉన్నవారు కూడా ఈ డ్రింక్ తాగొచ్చు.
ముందుగా పావు కేజీ పచ్చి శనగలు (తొక్కలు లేనివి) తీసుకోవాలి. వాటిని దోరగా వేయించాలి. పచ్చి వాసన పోయేంతవరకూ వేయిస్తే మంచిది. అవి వేడి చల్లారాక, మిక్సీలో వేసి పొడి చెయ్యాలి. లీటర్ నీటిలో 5 టేబుల్ స్పూన్ల శనగపిండిని కలపాలి. దానికి అదనంగా పంచదార (sugar) లేదా బెల్లం లేదా తేనె కలుపుకోవచ్చు. ఈ డ్రింకును డైరెక్టుగా కానీ, ఫ్రిడ్జ్‌లో కూలింగ్ చేసుకొని గానీ తాగితే వేసవి కాలంలో ఎంతో మంచిది. శనగపిండి పొడిని బాటిల్‌లో వేసి నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు షర్బత్ చేసుకొని తాగితే ఎండల ఉక్కపోత, వేడి నుంచీ ఉపశమనం పొందొచ్చు.