కరోనా ఎఫెక్ట్ షిర్డీ యాత్ర కొన్నాళ్ల పాటు వాయిదా.

0
96

ప్రపంచదేశాలను గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన షిర్డీపై పడింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టిన ఆలయ అధికారులు… ఇందులో భాగంగా ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. షిర్డీ సాయి ఆలయానికి ప్రతి రోజు దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు.

అయితే కరోనా కారణంగా భక్తులు షిర్డీ యాత్రను కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. షిర్డీ కొలువున్న మహారాష్ట్రలో ఈ కేసులు మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 30కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో… ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం… ఈ క్రమంలోనే షిర్డీ ఆలయాన్ని మూసి వేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.