మన దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అన్ని రాష్ట్రాలకూ కోవిడ్-19 మహమ్మారి విస్తరిస్తోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో తొలి కరోనా కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇతర రాష్ట్రాల బస్సులు ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు ఆల్ ఇండియా పర్మిట్ ఉన్న అన్ని ట్రావెల్స్ బస్సులకూ ఇది వర్తిస్తుందని వెల్లడించారు. తదుపరి ఆదేశాల వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఛత్తీస్‌గఢ్ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండడంతో.. తెలంగాణ నుంచి వెళ్లే బస్సులు కూడా నిలిచిపోనున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో 24 ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. లండన్‌లో చదువుకుంటున్న ఆ యువకుడు ఇటీవలే రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కి వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు బాధితుడి తల్లిదండ్రులను సైతం రాయ్‌పూర్ ఎయిమ్స్‌లోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ముందుజాగ్రత్తగా రాయ్‌పూర్‌లో 144 సెక్షన్ విధించారు. కాగా, మనదేశంలో కరోనా బాధితుల సంఖ్య 168కి చేరింది. కరోనా ప్రభావంతో ఇప్పటికే విద్యాసంస్థలు, థియేటర్లు మూతపడ్డాయి. CBSE,ICSE పరీక్షలు సైతం వాయిదాపడిన విషయం తెలిసిందే.