మాస్క్ లేకపోతే కరెంటు షాక్.. అది ఎక్కడో తెలుసా..

0
45

భారత్‌లో లాగే పక్కనే ఉన్న దేశం పాకిస్థాన్‌లో కూడా కరోనా వైరస్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు 113702 ఉండగా… మరణాలు 2255 ఉన్నాయి. కరోనాను ఎలా కంట్రోల్ చెయ్యాలో అక్కడి ప్రభుత్వానికీ, డాక్టర్లకూ, పోలీసులకూ అర్థం కావట్లేదు. ప్రధానంగా ప్రజలు పెద్దగా సహకరించట్లేదు. మాస్కులు పెట్టుకోవట్లేదు. సోషల్ డిస్టాన్స్ అంటే ఏంటో కూడా వాళ్లకు తెలియట్లేదు. ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నా… అవేవీ కరోనాను ఆపట్లేదు. దాంతో… ఫైసలాబాద్ పోలీసులు ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. అదే షాక్ ట్రీట్‌మెంట్. ప్రజలకు కరెంటు షాక్ ఇస్తే… అప్పుడు కచ్చితంగా మాస్క్ వాడతారని భావించిన పోలీసులు… విదేశాల నుంచి కరెంట్ షాక్ ఇచ్చే ప్రత్యేక ఎలక్ట్రిక్ షాట్ గన్ పరికరాల్ని తెప్పించారు. అవి లాఠీల లాగా ఉంటాయి. బటన్ నొక్కి… మనిషికి అంటిస్తే చాలు… కరెంటు షాక్ కొడుతుంది. ఈ షాక్ వల్ల మనిషికి ఎలాంటి అపాయమూ ఉండదు. కాకపోతే… అంటించినంత సేపూ… మనకు నిజంగా కరెంటు షాక్ తగిలితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది.

పోలీసులు ఎప్పుడైతే షాక్ ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారో… ప్రజలకు టెన్షన్ మొదలైంది. పోలీసులను చూడగానే… వాళ్ల చేతుల్లో ఆ పరికరాలు ఉన్నాయేమో అని చూస్తున్నారు. పరికరాలు లేకపోతే… దర్జాగా పోలీసుల ముందుకు వస్తున్నారు. పరికరం ఉంటే మాత్రం… బాబోయ్ అనుకుంటూ… యూటర్న్ తీసుకొని ఇళ్లలోకి పారిపోతున్నారు. కొంతమంది ఈ షాకులూ అవీ ఎందుకని… బుద్ధిగా మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. తద్వారా ఇప్పుడు మన దేశంలో లాగే… పాకిస్థాన్ ‌ఫైసలాబాద్‌లోనూ మాస్క్ వాడకం పెరిగింది. పాక్ పోలీసులతో పోల్చితే… మన దేశంలో పోలీసులే బెటర్. ఎందుకంటే… మన దగ్గర పోలీసులు రామ కోటి లాంటివి రాయించడమో, గుంజీలు తీయించడమో చేయించారే తప్ప కరెంటు షాకులు ఇవ్వలేదు.

ఇప్పుడిప్పుడే పాకిస్థాన్ ప్రజలు ఈ కరెంటు షాకులపై మండిపడుతున్నారు. మాస్క్ పెట్టుకోకపోతే… షాకులిస్తారా… అదేం పద్ధతి అని ఫైర్ అవుతున్నారు. పోలీసులు ఇస్తున్న షాక్… హై ఫ్రీక్వెన్సీ ఉంటోందనీ… నొప్పిగా ఉంటోందనీ… ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. పేదవాళ్లు, బైకులపై వెళ్లేవాళ్లు, రిక్షాలు నడిపేవాళ్లు, సామాన్యులనే పోలీసులు టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మైనర్లను కూడా వదలట్లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. “మమ్మల్ని ఇన్నిన్ని మాటలు అనే బదులు మాస్కులే పెట్టుకుంటే… మీ జోలికి రాము కదా… ఎన్నిసార్లు చెప్పినా మీ తీరు మారట్లేదు కాబట్టే… ఎప్పటికప్పుడు పనిష్మెంట్ స్థాయి పెరుగుతోంది” అని సమర్థించుకుంటున్నారు. దీనిపై ఆ దేశంలో చర్చ నడుస్తోంది.