సీఎం జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

0
68

జేసీ ట్రావెల్స్‌‌ వాహనాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారనే కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని శనివారం అనంతపురం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. దీనిపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టును టీవీలో చూసి తెలుసుకున్నానని, రేపు నన్ను అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం జగన్ ఎవ్వరికీ భయపడరని, ఆయనకు దేవుడు సైతం లేడని, రాష్ట్రంలో సీఎం జగన్‌కు ఎవరు అడ్డుచెప్పినా ఇదే పరిస్థితి ఎదుర్కొంటారని విమర్శించారు. సీఎం జగన్ తన ఆర్థిక ములాలన్నీ సమూలంగా నాశనం చేశారని, దీనీపై త్వరలోనే న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసని, జగన్‌కు అనుకూలంగా ఎవరూ మారకపోయినా ఇదే తరహా అరెస్టులు ఉంటాయని, అది స్వపక్షమైనా.. విపక్షమైనా పరిస్థితిలో తేడా ఉండదని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇప్పటికే ఆయనకుబైపాస్ సర్జరీ అయ్యిందని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు.