భారత చిత్ర పరిశ్రమలో నట దిగ్గజాలు అయిన లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్, అందాల తార శ్రీదేవి నటీనటులుగా భారతీరాజా దర్శకత్వంలో 1977లో వచ్చిన తమిళ చిత్రం ‘‘పదినారు వయదినిలే’’. ఈ చిత్రం నాలుగు తమిళనాడు రాష్ట్ర పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్. జానకి ఈ పురస్కారాలు అందుకున్నారు. అలాగే, ఉత్తమ గాయనిగా జానకి జాతీయ పురస్కారాన్ని, ఫిలిం ఫేర్ అవార్డును అందుకోవడం విశేషం.

ఈ సినిమాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో చంద్రమోహన్, మోహన్ బాబు, శ్రీదేవి ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ‘పదినారు వయదినిలే’ సినిమాను ప్రస్తుతం అధునాతన డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేశారు. అలాగే అన్ని పాటలను మళ్ళీ కొత్తగా పొందుపరిచారు. ఈ చిత్రానికి తెలుగులో ‘నీకోసం నిరీక్షణ’ అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అనంతరం మరో ఐదు భాషల్లోకి అనువాదం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత బామా రాజ్ కణ్ణు మాట్లాడుతూ.. ‘‘మధురమైన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా 5 పాటలను విడుదల చేశాం. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుమారు 30 నిముషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగ్గట్లుగా మార్పులు చేసి మీ ముందుకు తీసుకువస్తున్నాం’’ అని అన్నారు.