మరోసారి నల్లచొక్కాలో చంద్రబాబు.

0
104

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నల్లచొక్కా వేసుకున్నారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై నిరసన తెలిపేందుకు నల్లచొక్కాలతో అసెంబ్లీకి వెళ్లాలని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో నిర్ణయించిన చంద్రబాబు… ఆ మేరకు తాను కూడా నల్లచొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. గతేడాది ఫిబ్రవరితో జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నాడు సీఎం హోదాలో చంద్రబాబు నల్లచొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చే విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించిన చంద్రబాబు… అందుకు నిరసనగా అసెంబ్లీకి నల్లచొక్కా వేసుకుని వచ్చారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆయన నల్లచొక్కా వేసుకోవడం అదే మొదటిసారి.

అయితే ఏడాది తరువాత సీఎం స్థాయి నుంచి ప్రతిపక్ష నేత స్థాయికి చేరుకున్న చంద్రబాబు… మళ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే నల్లచొక్కా వేసుకుని అసెంబ్లీకి రావడం గమనార్హం. అయితే గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా నల్లచొక్కా వేసుకున్న చంద్రబాబు… ఈసారి ఏపీలోని అధికార వైసీపీ తీరుకు నిరసనగా నల్లచొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఏదేమైనా… ఏపీలో వరుసగా రెండో బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు నల్లచొక్కా వేసుకుని రావడం చర్చనీయాంశంగా మారింది.